ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల సాప్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ట్రెక్కింగ్‌కు వెళ్లి మృతి చెందాడు. గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ అట్లాంటాలో ట్రెక్కింగ్ చేస్తుండగా కిందపడి మృతి చెందాడు. గత ఆరేళ్లుగా అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనాథ్.. భార్య, స్నేహితులతో కలిసి అట్లాంటా ట్రెక్కింగ్‌కు వెళ్లగా ఈ ఘటన జరిగింది.
శ్రీనాథ్ కుటుంబీకులకు అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం క్లీవ్‌ల్యాండ్ మౌంటెన్ హిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. పర్వత ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు దాదాపు 200 అడుగుల కింద పడిపోయాడు. దీంతో టెక్కీ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన శ్రీనాథ్, అతని భార్య సాయిచరణి ఫ్లోరిడాలో పనిచేస్తున్నారు. ఈ జంట ఆరు నెలల క్రితం అట్లాంటాకు వెళ్లారు. శ్రీనాథ్ గుంటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు సుకవాసి శ్రీనివాస్ రావు అల్లుడు. శ్రీనాథ్ మృతి సమాచారం అందుకున్న తల్లితండ్రులు మల్లేశ్వరి, బాబురావు షాక్‌కు గురయ్యారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబీకులు కోరారు. శ్రీనివాసరావు భౌతికకాయాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షుడు అంజయ్య చౌదరి తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.