27న భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్ధతు

TDP Supports Bharat Bandh. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ

By Medi Samrat  Published on  25 Sept 2021 2:19 PM IST
27న భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్ధతు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘాలు 27న చేపట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతు ప్రయోజనాలకు టీడీపీ కట్టుబడి వుందని.. ఈ బంద్ లో టీడీపీ కార్యకర్తలు, నాయకలు పాల్గొని విజయవంతం చేయాలని ప్ర‌క‌ట‌న‌లో కోరారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని మా ఎంపీలు పార్లమెంట్ లో ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ రైతు వ్యతిరేక పార్టీగా మిగిలిపోయిందని విమ‌ర్శించారు. రైతులను కూలీలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆరోపించారు.

అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని.. డ్రిప్ ను రద్దు చేయడంతో మెట్టప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. రూ.50 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ మర్చిపోయారా..? అని ప్ర‌శ్నించారు. ఉచిత బోర్లు వేస్తామని ప్రచారం చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 28 నెలలుగా ఒక్కబోరు కూడా వేయలేదని మండిప‌డ్డారు. రైతులకు మద్ధతు ధర లేక పంటలను నేలపైనే పడబోస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ ఏమైంది.? రైతులకు అందించే సబ్సీడీలను రద్దు చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్ళున్నా రైతులకు అందించలేని స్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్వీర్యం చేశారని విమ‌ర్శించారు. సచివాలయాలను సందర్శిస్తానన్న సీఎం జగన్ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని స‌వాల్ విసిరారు. దళారులతో వైసీపీ నేతలు చేతులు కలిపి రైతుల పొట్టగొడుతున్నారని.. జగన్ దగాకు రైతులు బలయ్యారని.. రైతు ద్రోహిగా జగన్ మిగిలిపోయారని పేర్కొన్నారు.


Next Story