రాష్ట్రంలో సభలు పెట్టనివ్వడం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ సమావేశాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు కాని.. ప్రతిపక్ష పార్టీలు సభలు పెడితే మాత్రం అనుమతులు తీసుకోవాలని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన అల్లర్లకు వైసీపీనే కారణమని.. జీఓ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో సహించరానిదని చంద్రబాబు అన్నారు. జీవోలు తమకు వర్తిస్తాయి కాని.. వైసీపీకి కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ మాత్రం సభలు, సమావేశాలు, ర్యాలీలు చేస్తోందని.. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతల సమావేశాలకు జనాలు రావడం సహజం.. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానిది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
జీవో నెం.1 తీసుకొచ్చి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జరగరానిది జరుగుతోంది. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌ను హింసించారు. ఇప్పటంలో పవన్ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చేశారు. విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నెం.1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశాం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయని అన్నారు చంద్రబాబు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా? కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతాం. ఏపీ అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే మా ఆఫీస్‌పై దాడులు చేశారు. ఏపీలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారమైందని అన్నారు చంద్రబాబు.