రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనే

రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

By Medi Samrat  Published on  6 Jan 2025 4:34 PM IST
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనే

రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా కుప్పానికి ఎమ్మెల్యేనే అని, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్ స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్ధేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు.

కుప్పంలో అభివృద్ధి పరుగులు

2024 ఎన్నికల తర్వాత నేను 2వ సారి కుప్పం వచ్చాను. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్ గా యువ ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించా. కుప్పంలో దాదాపు 65 వేల కుటుంబాల వరకూ ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నాము. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15 వేల ఉద్యోగాల కల్పన,100 శాతం సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్ పోర్టు పూర్తిచేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100 శాతం మరుగుదొడ్లు నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆస్పత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించి కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్, టూరిజం హబ్ గా తయారు చేయడం వంటి నిర్ధిష్ట ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ – 2029 రూపొందించామని అన్నారు.

ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఎవరినీ స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు. ప్రజలను అణిచివేశారు. వారికి మంచి చేయాలనే ఆలోచన లేదు . రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే వైసీపీని ఓడించాలని నేనూ, నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుకు మీరు స్పందించి బ్రహ్మరథం పట్టారు. నేను సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాను. పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేశాను. రాజకీయాలంటే ఆషామాషీగా తీసుకోకుండా పబ్లిక్ పాలసీ తీసుకొస్తే చరిత్ర తిరగరాయొచ్చుని భావించాను. అదే అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించాను. ఒక సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన పార్టీ తెలుగుదేశమే. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దే. దురదృష్టవశాత్తు దేవాలయం లాంటి యూనివర్సిటీలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైసీపీ వాడుకుంది. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాము.

ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం

నేను నాడు విజన్-2020 అని నినాదం ఇస్తే కొంతమంది హేళన చేశారు. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్ ప్రాంతమంతా రాళ్లు, రప్పలు. అక్కడ ఐటీని అభివృద్ధి చేసేందుకు హై టెక్ సిటీ నిర్మించాను. ప్రపంచంలోనే ఐటీ సిటీగా హైదరాబాద్ తయారవుతుందని ఆనాడే చెప్పాను. నాడు టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదేమీ లేదు. మనమంతా సమిష్టిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన తెలుగుబిడ్డ పీవీ. నరసింహారావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తాము. రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. జూన్ లోగా హంద్రినీవా జలాలను పాలారు వాగుకు తీసుకొస్తా. ఈ వాగుపై చెక్ డ్యామ్ కూడా నిర్మిస్తా. నీటి భద్రత, కరవు నివారణ కోసం గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించాం. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టాను. స్వచ్చాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నాము. భవిష్యత్ లో డీప్ టెక్నాలజీ దే హవా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి 150 సేవలు అందించబోతున్నాము. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ జనాభా గ్రోత్ రేట్ 1.5 % .దక్షణ కొరియా .5% గా ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి' అని సీఎం చంద్రబాబు అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిచ్చి కుప్పం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రణాళికలను వివరించారు.

Next Story