తెలుగు అకాడమీ విభజన అంశంపై తెలంగాణ రాష్ట్రానికి శుక్రవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల్లోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగు అకాడమీ విభజన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణకు అనుమతినిచ్చిన న్యాయస్థానం.. రూ. 92. 94 కోట్ల పెండింగ్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కి వారంలోపే చెల్లించాలని పేర్కొంది. మొత్తం సొమ్ముపై 6 శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు పేర్కొంది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఆస్తులు, నిధుల పంపకంపై హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.