విజయవాడలోని సత్యనారాయణపురంలో గల శ్రీనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన జగాని రవి(40), తన కూతురు గీతా సహస్రతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూడలేక తాను చనిపోతున్నానని అందులో పేర్కొన్నాడు. తన అవయవాలతో పాటు కూతురి అవయవాలను తన భార్య భరణికి ఇవ్వాలని లేఖలో పేర్కోన్నాడు. రవి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి.. అనంతరం ఆ ఉద్యోగాన్ని మానేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులూ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.