శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి : హోంమంత్రి
By Medi Samrat Published on 18 July 2024 5:07 PM ISTరాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని.. అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని హోంమంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణనలోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని.. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని.. ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
మహిళా, శిశు సంక్షేమ, విద్యా, పోలీసు శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి.. విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనిత తెలిపారు.