అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు. వారు శాఖ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను సూచించారు. దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో అకాడమీని ఏర్పాటు చేస్తే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణాన్ని కల్పించడంతోపాటు రవాణా, తత్సంబంధిత మౌలిక సదుపాయాలూ ఉంటాయని అభిప్రాయపడ్డారు. రక్షిత అటవీ ప్రాంతాన్ని వినియోగించుకొనే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాశారు. దివాన్ చెరువులోని రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చంటూ స్పష్టత ఇచ్చింది. కేంద్రం స్పష్టత ఇచ్చిన క్రమంలో అకాడమీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.