ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్‌లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
By - Knakam Karthik |
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్‌లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.
కాగా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాజధానిని కేంద్రం ప్రకటించాల్సి ఉంది. అటు గత పదేళ్లుగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాద్ ఉంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడవు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ నివేదించింది.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి ఏపీ సర్కార్ నోట్ ఇచ్చింది. నివేదించిన అనంతరం ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ కోరింది. 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడవు ముగుస్తున్నందున ఆరోజు నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో నోడల్ ఏజన్సీగా అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సంబంధం ఉన్న అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర హోం శాఖ అభిప్రాయలు కోరినట్లు సమాచారం. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయలు చెప్పినా..పట్టణాభివృద్ది, న్యాయ, వ్యయ శాఖల అభిప్రాయాలను త్వరగా పంపాలని హోం శాఖ కోరినట్లు సమాచారం. పలు మంత్రిత్వ శాఖలతో పాటు.... నీతి ఆయోగ్ అభిప్రాయం కూడా కేంద్ర హోం శాఖ కోరింది.
రెండు దఫాలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ముందు, కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు అనుగుణంగా కేంద్ర హోం శాఖ క్యాబినెట్ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైనట్లు అధికార వర్గాల వెల్లడించాయి.