ఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకున్నందుకే శ్వేత ఆత్మహత్య చేసుకుందా..?

Software Engineer Swetha Suicide Case. ఆన్ లైన్ లో మాయ మాటలు చెప్పే వ్యక్తుల మాటలను విని ఎంతో మంది మోసపోతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  4 July 2022 7:04 AM GMT
ఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకున్నందుకే శ్వేత ఆత్మహత్య చేసుకుందా..?

ఆన్ లైన్ లో మాయ మాటలు చెప్పే వ్యక్తుల మాటలను విని ఎంతో మంది మోసపోతూ ఉన్నారు. చదువుకోని వారికంటే.. చదువుకున్న వారే ఆన్ లైన్ కేటుగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. డబ్బులు పోగొట్టుకున్నామని.. మోసపోయామని.. తెలుసుకున్నాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్వేత చౌదరి మరణం వెనుక ఆన్ లైన్ ఫ్రాడ్ ఉందని అంటున్నారు.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం నువులూరుకు చెందిన శ్వేత‌(22) స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌. గ‌త మూడు నెల‌లుగా ఇంటి నుంచే ప‌ని చేస్తోంది. మ‌రో కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌లుదేరింది. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు వాట్సాప్‌లో త‌ల్లికి మెసేజ్ పంపింది. ఆందోళ‌నగురైన త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం చిల్ల‌ప‌ల్లి చెరువులో శ్వేత మృత‌దేహాన్ని గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జ‌గ్గ‌య్య పేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

దర్యాప్తులో ఆమె ఓ వ్యక్తిని నమ్మి డబ్బులు మోసపోయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఇటీవల ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తి లక్షా 20వేలు చెల్లిస్తే.. ఏడు లక్షలిస్తానని శ్వేతా చౌదరిని నమ్మించాడు. ఆమె తన దగ్గర అంత డబ్బులు లేవని చెప్పడంతో అతడే రూ.50వేలు శ్వేతకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ రూ.50వేలతో కలిపి మిగిలిన డబ్బులను ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె రూ.1.30 లక్షలు చెల్లించింది. కానీ ఆమె అనుకున్నది.. అతడు చెప్పింది జరగలేదు. రెండు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రాడవంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు డబ్బులు పంపిన ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story