ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలతో చర్చించినట్టు ఎస్ఈసీ తెలిపింది.
పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని.. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని వివరించింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. నిత్యం వేలల్లో వచ్చిన కేసులు ఇప్పుడు వందల్లోనే వస్తున్నాయన్నారు. తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని ఉద్ఘాటించారు. ఇక కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని రమేశ్ కుమార్ తెలిపారు.