గవర్నర్ తో ముగిసిన ఎస్ఈసీ భేటీ.. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
SEC Meet With Governor. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై రాజకీయ వేడి మళ్లీ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో
By Medi Samrat Published on 18 Nov 2020 1:48 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై రాజకీయ వేడి మళ్లీ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని బావిస్తున్నట్లు.. అందుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు.
ఇదిలా ఉంటే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికల విషయమై ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు గవర్నర్ తో చర్చించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలపై అయన గవర్నర్ భేటీలో చర్చించారు. ప్రభుత్వ వైఖరిపై కూడా ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండటం లేదని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం కరోనా పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తుందని, స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్ఈసి వంటి చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తుందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సీఎస్ రాసిన లేఖపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని అందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నేటి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన వెలుగుచూసే అవకాశం ఉంది.