పక్కా ప్లానింగ్ ప్రకారమే అమలాపురం అల్లర్లు జరిగాయి
Sajjala Ramakrishna Reddy Fire On Chandrababu Pawan Kalyan. పక్కా ప్లానింగ్ ప్రకారమే అమలాపురం అల్లర్లు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 25 May 2022 6:28 PM IST
పక్కా ప్లానింగ్ ప్రకారమే అమలాపురం అల్లర్లు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అల్లర్లు వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే కుట్ర కోణం అనుమానం బలపడుతోందని అన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని అన్నారు. మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులు, పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.
మా మంత్రి, మా ఎమ్మెల్యే ఇంటిపై మేం దాడి చేయిస్తామా..? టీడీపీ, జనసేన మాటల తీరును ప్రజలు ఛీదరించుకోరా..? ప్రతిపక్షాల ఆరోపణల్లో అర్థముందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అడ్డగోలు ఆరోపణలు ప్రతిపక్షాల విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని.. పరిస్థితి అదుపు తప్పాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరుకున్నారని.. అల్లర్లలో పాల్గొన్న వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చే పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ సరిగా రాస్తున్నట్లు లేదని.. అంబేద్కర్ పేరు పెట్టాలనా.. వద్దనా.. నీ స్టాండ్ ఏంటీ చంద్రబాబు..? అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ ఒక కులం, ఒక మతానికి చెందిన వారు కాదు.. ఆయన జాతి నేత అని అన్నారు. అంబేద్కర్ పేరు వద్దనుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పాలని అన్నారు. అమలాపురం అల్లర్లు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
జనసేన కార్యక్రమాల్లో అన్యం సాయి పాల్గొన్న ఫొటోలు వచ్చాయి. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడొద్దు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలా..వద్దా? చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలలో ఉన్న చంద్రబాబు మనుషులతో స్టేట్‌మెంట్లు ఇప్పించి.. ఎల్లో మీడియాలో రాసి, చర్చలు పెట్టి.. అవే తీసుకొచ్చి మమ్మల్ని అడుగుతారని విమర్శించారు.
టీడీపీ హయాంలో అత్యాచార ఘటనలపై పవన్‌కు వివరాలు పంపిస్తామని అన్నారు. కులం, మతం అడ్డుపెట్టుకుని మేం అధికారంలోకి రాలేదని వివరించారు. సంక్షేమ క్యాలెండర్ పెట్టి డబ్బులు అకౌంట్లలో వేస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ప్రజల అభిమానం చూరుగొంటేనే అధికారంలోకి వస్తారని.. చిల్లర రాజకీయాలతో నాయకులుగా ఎదగలేరని విమర్శించారు.