ఇటీవల సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాటల యుద్దానికి దిగిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం కోసం ఆయనను వ్యక్తిగతంగా కలవనున్నారు. ట్విట్టర్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాల వేదికగా రెండు రోజులు వాదించిన తరువాత, రామ్ గోపాల్ వర్మ వివరంగా చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని అభ్యర్థించారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరలపై జీఓ 35పై ఏపీ ప్రభుత్వంపై వర్మ వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
మంత్రి పేర్ని నాని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమా టికెట్ ధర విషయమై మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇది వారి వర్చువల్ వాదనకు దారితీసింది. అది వారి ట్విట్టర్ టైమ్‌లైన్‌లలో కొన్ని రోజులు కొనసాగింది. ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో పేద ప్రజలను దోపిడి చేయడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం, మంత్రి ఈ ఉత్తర్వులు తీసుకురావడానికి గల కారణాన్ని పేర్కొంటుండగా, వర్మ వారి లాజిక్‌ను వ్యతిరేకించారు. అనేక మార్కెటింగ్ సిద్ధాంతాలు, విశ్లేషణలు తీసుకొచ్చిన వర్మ.. రాష్ట్ర ప్రభుత్వ అనవసర చర్యను కప్పిపుచ్చేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.