Andhra Pradesh : ముంపు ప్రభావిత జిల్లాలలో సహాయ కార్యకలాపాలకై నిధులు విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వరదలపై కలెక్టర్లకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వరద ప్రవాహన్ని బట్టి లొతట్టు ప్రాంతప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ వంటివి అందుబాటులో ఉంచాలన్నారు.
వరద ముంపు ప్రాంతాల నుండి బాధితులను సహాయ శిబిరాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఇతర సహాయ కార్యకలాపాలు కోసం ప్రభావిత జిల్లాలకు టిఆర్-27 క్రింద ఒక్కో జిల్లాకు కోటి రూపాయలు చొప్పున 16 జిల్లాలకు 16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయక చర్యలు కోసం కృష్ణా జిల్లా - అవనిగడ్డ, ఎన్టీఆర్ జిల్లా – విజయవాడ, కృష్ణా ఘాట్, అల్లూరి జిల్లా చింతూరు, కోనసీమ-అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
గోదావరి నదికి వరద ప్రవాహం మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 36.6 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 7.40 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద సాయంత్రం 6 గంటల నాటికి ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులు ఉందని రేపటికి మరింత వరద పెరిగే అవకాశం ఉందన్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వివిధ ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక లోతట్టు/లంక గ్రామప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.