ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నంలను గుర్తించండి

దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు.

By -  Medi Samrat
Published on : 14 Oct 2025 8:10 PM IST

ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నంలను గుర్తించండి

దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ మారియట్ హోటల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరుగుతున్న సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం, తిరుపతి లను ప్రధాన గమ్యస్థానాలుగా ప్రతిపాదిస్తున్నామని, ఈ ప్రాంతాలు తమ రాష్ట్ర వైవిధ్యాన్ని, సంసిద్ధతను, అంతర్జాతీయ ప్రమాణాలను ప్రతిబింబింపజేస్తాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పేరా సముద్రతీర, మెరైన్ గమ్యస్థానం గా విశాఖ,అధ్యాత్మిక, సాంస్కృతిక గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

జాతీయ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024–29 నూతన పర్యాటక విధానం ప్రకటించిందని తద్వారా సమగ్ర, పెట్టుబడి-ఆధారిత విధానాన్ని అవలంబిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గడిచిన 15 నెలల్లో దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులతో పాటు తాజ్, ఐటీసీ, ఒబెరాయ్, హిల్టన్, లెమన్ ట్రీ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లతో కూడిన 21 హోటల్ మరియు రిసార్ట్ ప్రాజెక్టులను ఏపీకి వచ్చేలా ఆకర్షించామన్నారు. రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 18,000 మందికి పైగా ఉద్యోగాలను సృష్టించామన్నారు. అంతేగాక గ్రామీణ,గిరిజన పర్యాటక సర్క్యూట్‌లలో 10,000 హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీకి ప్రత్యేకమైన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్) నమూనా ద్వారా పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధిని ఏకీకృతం చేస్తున్నామని తెలిపారు. తద్వారా స్థానిక సంఘాలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపై తీసుకువచ్చి కలిసి పని చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు.2029 నాటికి పర్యాటక రంగం రాష్ట్ర జీవీఏలో వాటాను 4.6% నుండి 8%కు పెంచడం, 5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడం, 50,000 హోటళ్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అంతేగాక తిరుమల పవిత్ర కొండలను మొదలుకొని విశాఖపట్నం సముద్రతీరాల వరకు, పచ్చని అరకు లోయ నుండి గోదావరి బ్యాక్ వాటర్స్, అమరావతి బౌద్ధ వారసత్వ క్షేత్రాల వరకు పర్యాటకులకు ఆధ్యాత్మిక, తీరప్రాంత, పర్యావరణ, ఆరోగ్య, సాంస్కృతిక,సాహస పర్యాటక అనుభవాలు అందిస్తున్నామన్నారు.

విశాఖకు నూతన పర్యాటక శోభ:మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నాన్ని భారతదేశపు తొలి ఓషనేరియం, మెరైన్ ఎక్స్‌పీరియన్స్ పార్క్‌గా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, క్రూయిజ్ టెర్మినల్, భీమిలి–రుషికొండ పర్యాటక కారిడార్‌ను ఒక శక్తివంతమైన తీరప్రాంత హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను కాన్ఫరెన్స్ లో వివరించారు.

అధ్యాత్మిక విద్య, వెల్‌నెస్, సాంస్కృతిక కేంద్రంగా తిరుపతి:మంత్రి కందుల దుర్గేష్

తిరుపతిలో పవిత్ర కొండల అధ్యాత్మికతను విస్తరించే దిశగా, “Spiritual Civilization Museum & Mythological Experience Park” ను స్థాపించాలని యోచిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ నాగరికత కథను డిజిటల్ డోమ్స్, లైవ్ క్రాఫ్ట్ పెవిలియన్లు, “వాక్ ఆఫ్ ఫెయిత్” ప్రోమెనేడ్ ద్వారా తిరుమల పవిత్రతను కాపాడుతూనే అధ్యాత్మిక విద్య, వెల్‌నెస్ , సంస్కృతికి కేంద్రంగా నిలుపుతామన్నారు.

భారతదేశ వైవిధ్యాన్ని, ప్రపంచస్థాయి పర్యాటక అనుభవాలను అందించేవి ఈ రెండు ప్రాజెక్టులు: మంత్రి కందుల దుర్గేష్

తీరప్రాంతం,ఆధ్యాత్మికం కలగవలసిన ఈ రెండు ప్రాజెక్టులు భారతదేశ వైవిధ్యాన్ని, ప్రపంచస్థాయి పర్యాటక అనుభవాలను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని తెలుపుతాయని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు వివరించారు. ఈ రెండు గమ్యస్థానాల చుట్టూ హోటళ్లు, రిసార్ట్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, MICE మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో కన్వెన్షన్ సెంటర్లు, వాటర్‌ఫ్రంట్ రిసార్ట్‌లు, క్రూయిజ్ టెర్మినల్స్, సాహస అనుభవాలను సమన్వయం చేస్తూ విశాఖ నగరాన్ని వ్యాపార, విహారయాత్రలకు కేంద్రంగా నిలుపుతామన్నారు. అదే విధంగా తిరుపతిలో ఆధ్యాత్మికతను కొనసాగిస్తూ, ప్రపంచ స్థాయి వెడ్డింగ్, వెల్‌నెస్ , సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేసి భారతదేశపు అగ్రగ్రామి గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు.ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా ఆర్థిక వృద్ధిని వారసత్వ సంస్కృతితో, ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రజల భాగస్వామ్యంతో, ఆధునిక సాంకేతికతను సాంప్రదాయ విలువలతో మిళితం చేస్తామని తెలిపారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా మాత్రమే కాక, 2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా నిలుపుతామని మంత్రి కందుల దుర్గేష్ ఘంటాపథంగా తెలిపారు. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ పర్యాటక రంగం అద్భుత పురోగతి సాధిస్తుందని వెల్లడించారు.

జాతీయ మిషన్ రూపకల్పనలో భాగంగా తాము ఏపీ పర్యాటక గమ్యస్థాన అభివృద్ధిపై దృష్టి పెడతామని టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట అన్నారు. చివరి మైలురాయి వరకు కనెక్టివిటీ, సౌకర్యాలు, సూచికలు, పారిశుధ్యం, ఎలక్ట్రిక్ వాహన రవాణా మరియు డిజిటల్ విజిటర్ సిస్టమ్స్‌ను మెరుగుపరుస్తుందని తాము భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అవసరమైన ల్యాండ్ పార్సెల్స్, పెట్టుబడి ప్రతిపాదనలు, శిక్షణ పొందిన మానవ వనరులు, శక్తివంతమైన పాలనా వ్యవస్థతో ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

Next Story