భారత వాతావరణ శాఖ మే 16 నుండి 20 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ (NCAP), యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ (SCAP), రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, శనివారం NCAP, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. శుక్రవారం అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం, మంగళవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు, మూడు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.