నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు కోమరిన్ ప్రాంతం, దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో సుమారు నవంబర్ 29 తేదీకల్లా ఏర్పడవచ్చని, తిరుపతి, నెల్లూరులో 13 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని.. వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. తర్వాత 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు.
ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఒకటి, రెండు చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.