దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వాంటం కంప్యూటింగ్‌లో రాష్ట్రాన్ని దేశంలో ముందు వరుసలో నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ తో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యాకలాపాలు ప్రారంభించాలని ఆ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక రోజు :
ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందం ‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు.
భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే ఎల్&టీకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తే, మరొక కమిటీ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి త్వరలోనే ఈ ప్రాజెక్టును సవివరంగా తెలియజేస్తామన్నారు.
#BREAKING #AndhraPradesh CM Chandrababu Naidu to dedicate ‘Quantum Valley’ on Jan 1, 2026 to Nation; signs MoUs with IBM, TCS & L&T*India’s 1st #QuantumValley Tech Park to be inaugurated in #Amaravati #ChandrababuNaidu #APGovt pic.twitter.com/IOQHRIxcdv
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) May 2, 2025