TTD మీటింగ్‌లో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టారు..కూటమి సర్కార్‌పై కన్నబాబు ఫైర్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 5:54 PM ISTTTD మీటింగ్‌లో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టారు..కూటమి సర్కార్‌పై కన్నబాబు ఫైర్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే బాధితులకు డబ్బులిచ్చారంటూ దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ అడిగినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పలేదని అన్నారు. నిజానికి ఈ ఘటనకు బాధ్యుడై క్షమాపణలు చెప్పాల్సింది చంద్రబాబే అన్నారు.
టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతుందన్న ఆయన, గతంలో టీడీపీకి సేవలు చేసిన కంపెనీలను తెచ్చి టీటీడీ పాలకమండలి సమావేశాల్లో కూర్చోబెట్టారని అన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అడ్రస్ లేని సంస్థలతో టీటీడీ AI ప్రాజెక్టులు చేపడుతుందా అని కన్నబాబు ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు, సూపర్ సిక్స్ ఇవ్వలేదు, ధరలు తగ్గించలేదని మండిపడ్డారు. కరెంట్ నుంచి బస్సు దాకా ఛార్జీలతో దెబ్బ మీద దెబ్బ కొట్టారని విమర్శించారు. ప్రజలు మాత్రం పండుగ చేసుకోవాలంటున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మాత్రమేనని, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసి చూపించారని కన్నబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా చేశారన్నారు. చంద్రబాబు ఇస్తానన్న సంక్రాంతి కానుక ఇవ్వలేదని, పెద్ద పండుగ ప్రజలకు రాలేదన్నారు. కూటమి నాయకులకు దోచుకోవడానికే పండుగ వచ్చిందని ఎద్దేవా చేశారు.