అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాజధాని పనులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. అనంతరం తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పుణ్యభూమిలో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, నా మిత్రుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, శక్తిమంతుడు పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని పేర్కొన్న ప్రధాని మోదీ.. "ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకొన్నా." ప్రధాని మోదీ అన్నారు.
2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశాను. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించింది.. ఇక ముందు కూడా సహకరిస్తుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలు కన్నారు.. ఈనాడు మనందరం కలిసి ఎన్టీఆర్ కలలను నిజం చేయాలి. వికసిత భారత్ కు ఏపీ ఒక గ్రోత్ ఇంజిన్ లా ఎదగాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇది మనం చేయాలి.. మనమే చేయాలన్నారు.
ఏపీలో కనెక్టివిటీ పరంగా కొత్త అధ్యాయం మొదలవుతోంది. నాయుడుపేట-రేణిగుంట హైవే అందుకు నిదర్శనం. తిరుపతి వెంకన్న దర్శనం కోసం వెళ్లే వారు ఎంతో త్వరగా ఈ రహదారిపై ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్ల రూపాయల సాయం చేస్తోంది." అని ప్రధాని మోదీ వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్న ప్రధాని మోదీ.. "రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. రాజధాని అమరావతి ఏపీ ఆశలు, వికసిత్ భారత్ ఆశలు.. స్వర్ణాంధ్రకు బీజం. ఏపీని అధునాతన రాష్ట్రంగా మార్చబోతోంది అమరావతి. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి." అని వ్యాఖ్యానించారు.