అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన‌ ప్రధాని మోదీ

Prime Minister Modi unveiled the bronze statue of Alluri Sitaramaraju. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు

By Medi Samrat  Published on  4 July 2022 9:11 AM GMT
అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన‌ ప్రధాని మోదీ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆర్‌ కే రోజా, దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)లు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో సీఎం వైయస్‌.జగన్‌ ప్రధాని నరేంద్రమోదీని శాలువతో సత్కరించి, జ్ఞాపికను, విప్లవ వీరుని పోరాటానికి గుర్తుగా విల్లు, బాణం బహుకరించారు.కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కార్య‌క్ర‌మంలో అల్లూరి సీతారామరాజు, మల్లుదొర వారసులను ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్‌లు సత్కరించారు.

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.

వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఈ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకుని మనమంతా ఇవాళ ఏకమయ్యాం. ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్ధం మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డమీద మన పూర్వీకులు మన స్వాతంత్య్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్య్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. ఇది ఈ అజాదీ కా అమృత్‌ అనే పదానికి అర్ధం. 75 ఏళ్ల క్రితం వరకు జరిగన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు.. అంటే దాదాపు 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే.. పరాయి దేశాల, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే.. అడుగులు ముందుకు వేసిందన్నారు.

లక్షల మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం. అటువంటి మహా త్యాగ మూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని.. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125 వ జయంతి సందర్భంగా.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధామంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం అని అన్నారు.

తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే.. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టామ‌ని పేర్కొన్నారు.

ఇక్కడ (భీమవరంలో)ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్‌ అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.


































Next Story