కాంగ్రెస్ భట్టీ విక్రమార్కను అవమానించిందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
By Medi Samrat Published on 16 March 2024 12:20 PM GMTయాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పెద్ద బల్లలపై కూర్చొన్నారు. వారి పక్కనే మరో చిన్న స్టూల్‌పై కూర్చొని భట్టి ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భట్టిని అవమానించారంటూ వార్తలు వచ్చాయి. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాగర్‌కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. కేసీఆర్ దళితబంధు పేరిట మోసం చేశారన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని మోసం చేశారని, కొత్త రాజ్యాంగం రాస్తామంటూ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు. తెలంగాణను మరింత నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ అయిదేళ్లు చాలని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.
ఇక చిన్న స్టూల్ వివాదంపై ఇంతకు ముందే భట్టి వివరణ ఇచ్చారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని ఆయన వెల్లడించారు. ఒక్క ఫొటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనని ఎవరూ అవమానించలేదంటూ ఈ సందర్భంగా భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. దీన్ని అందరూ అర్థం చేసుకుని ఇకనైనా దీనిపై రాదాంతం చేయడం మానుకోవాలని అన్నారు.