ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తమ డిమాండ్లను అంగీకరించినందుకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యమని, వారి సహకారంతో మరెన్నో మంచి పనులు చేయగలుగుతామని పునరుద్ఘాటించారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఉద్యోగుల కోసం చేయగలిగినదంతా చేస్తోందన్నారు. ఈ సందర్భంగా 'ఈ ప్రభుత్వం మీది.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. మీరు (ఉద్యోగులు) లేకపోతే నేను లేను' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చని, పరిస్థితి బావుండి ఉంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని సీఎం జగన్ అన్నారు. కానీ ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశామని, ఇప్పుడు మొత్తంగా రూ.11,577 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రతిపాదనలు అంగీకరించినందుకు ధన్యవాదాలన్నారు. మీ సహకారం వల్లే పారదర్శకంగా, అవినీతి లేకుండా ప్రజలకు మేలు చేస్తున్నాను, భావోద్వేగాలకు తావు ఇవ్వకండి.. ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామన్నారు. అన్ని వివరాలతో సీపీఎస్ మీద దృష్టి పెట్టాం.. వాటన్నింటినీ మీతో చర్చిస్తాం అని ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం వైఎస్ జగన్ అన్నారు.