2024లో కలిశారు.. 2029లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? : పోతిన మహేష్
ఆంధ్రప్రదేశ్ ఎన్నిలలో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరిశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు
By Medi Samrat Published on 6 Jun 2024 2:08 PM ISTఆంధ్రప్రదేశ్ ఎన్నిలలో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరిశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జనం కోసం జగన్.. జగన్ కోసం జనం.. కచ్చితంగా నిలబడతారని.. మరల ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని అన్నారు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ పార్టీ 88 అసెంబ్లీ స్థానాలను కోల్పోయిందన్నారు. 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే 100 సీట్లతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేవారన్నారు.
వైసీపీ ఐదు వేల ఓట్ల తేడాతో 19 సీట్లు, 10 వేల ఓట్ల తేడాతో 28 సీట్లు, పదిహేను వేల ఓట్ల తేడాతో 41 స్థానాలను.. అంటే 10 లక్షల ఓట్ల తేడాతో 88 స్థానాలని కోల్పోయింది. ఈ 88 స్థానాలకు వచ్చిన 11 స్థానాలు కలుపుకుంటే 99 నుంచి 100 స్థానాలతో వైసీపీ మరొకసారి అధికారంలోకి వచ్చేదన్నారు.
వైయస్ జగన్‌పై కూటమి చేస్తున్న విషప్రచారంలో వాస్తవం లేదన్నారు. 90 వేల పైచిలుకు మెజార్టీ వచ్చిన స్థానాలు కేవలం 3 మాత్రమేనన్నారు. 50 వేల నుంచి 80 వేల లోపు వచ్చిన మెజారిటీలు 27 స్థానాలు మాత్రమేనన్నారు. వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధానంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకపోవడం, నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం మాత్రమేనన్నారు.
కూటమి ఏమన్నా శాశ్వతమా.. అవసరాలను బట్టి ప్రాధాన్యతలను బట్టి కూటములు ఏర్పడతాయి. 2014లో కలిసి పోటీ చేశారు.. 2019లో విడిపోయారు.. 2024లో కలిశారు.. 2029లో కలిసుంటారని గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి పాలన ప్రజారంజకంగా ఉంటుందా లేక పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందో అనే విషయం అతి తొందర్లోనే ప్రజలకు చాలా తొందరగా అర్థం అవుతుందన్నారు.
ప్రతీకార పాలన ఉండదని మాట్లాడుతూనే.. గెలిచి 24 గంటలు కాకముందే ప్రతీకార దాడులు చేస్తున్నారు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందోనన్నారు.
జగన్ పేద సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నందుకే వారిపై కూటమి విషప్రచారం చేసింది.. ఆ ఉచ్చులో ప్రజలు పడ్డారేమో అని అనిపిస్తుందన్నారు. అభివృద్ధి అంటే ఆకాశాన్ని అంటే బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్న వాస్తవం ప్రజలకి అతి తొందర్లోనే తెలుస్తుందన్నారు. జగన్ పేద సామాన్య వర్గాల జీవన ప్రమాణాల పెంపు కోసం విప్లవాత్మకంగా తెచ్చిన పథకాల విలువ అర్థమవుతుందన్నారు. జగన్ విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, చిన్న జిల్లాల ఏర్పాటు, వాలంటరీ వ్యవస్థ, సెంటు భూమి, అమరావతిలో ఇళ్ళ పట్టాలు కూటమి కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందో చూద్దామన్నారు.