వంగ గీత ఇంటర్వ్యూ : పవన్‌పై గెలుపుకు వ్యూహం ఉంది
2024లో జరగనున్న ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), జనసేన పార్టీ (జేఎస్‌పీ)ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 April 2024 4:50 AM GMT2024లో జరగనున్న ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), జనసేన పార్టీ (జేఎస్‌పీ)ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఇందుకు కారణం. వైఎస్సార్‌సీపీ కూడా ఈ దఫా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాపు నేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతను బరిలోకి దింపుతోంది.
1993లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గీత ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ (పిఆర్‌పి)లో చేరారు. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత గీత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరిన గీత కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు.
న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. వంగ గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి.. రాష్ట్రంలో విద్యా, వైద్య మరియు పర్యాటక కేంద్రంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి.. తన వద్ద ఉన్న ప్రణాళికలను పంచుకున్నారు.
న్యూస్‌మీటర్ : మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నారు.. మీ బలాలు ఏమిటి? నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు?
గీత: ఈ నియోజక వర్గంలో అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలిగా.. ఇక్కడి ప్రజలతో.. ప్రతి వర్గంతో వ్యక్తిగత సంబంధం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను స్థానికంగా ప్రజలతో మమేకమై ఉన్నారు. నా రాజకీయ జీవితం ప్రారంభం నుండి ప్రజలు నన్ను విశ్వసించారు, నేను అందరితో చాలా సన్నిహితంగా ఉంటాను.
గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు, రాష్ట్ర హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలు స్థాపించాను. నేను, నా ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారమే. నియోజకవర్గంలోని ప్రజలు నా పనితీరు ఆధారంగా నా మెజారిటీని ఇప్పటికే నిర్ణయించారు.
న్యూస్‌మీటర్ : మీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? నియోజకవర్గంలోని ప్రజలు మీకు అనుకూలంగా ఉంటారని ఎందుకు భావిస్తున్నారు?
గీత: నియోజకవర్గం అంతటా నా ఎన్నికల ప్రచారానికి మహిళల నుండి సీనియర్ సిటిజన్ల వరకు చాలా సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు మంచి జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను పంపిణీ చేసినందున ప్రజలు వైఎస్ జగన్‌తో అనుబంధం పెంచుకోవడం ప్రారంభించారు.
సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఉదాహరణకు విద్యారంగంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో నాడు-నేడు పథకం కింద పాఠశాలల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి వైసీపీపై సమాజంలోని అన్ని కోణాల నుండి సానుకూల అభిప్రాయాన్ని తీసుకొచ్చింది. గత ఐదేళ్లుగా ప్రజలతో మమేకమయ్యాను. అన్నింటికీ మించి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక కార్యక్రమాలను అమలు చేసేలా నేను చేసిన ప్రయత్నాలే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు క్లీన్ మ్యాండేట్‌ని అందిస్తాయి.
న్యూస్‌మీటర్ : మీ ప్రచార వ్యూహం ఏమిటి?
గీత: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు.. పవన్ కల్యాణ్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కోవడానికి నేను అనేక రకాల వ్యూహాలను అనుసరిస్తున్నాను. ప్రజలకు చేరువయ్యేందుకు మెరుగైన ఆలోచనలు చేయాలని నా కేడర్ సూచిస్తోంది. ఇప్పటి వరకూ నియోజకవర్గంలోని దాదాపు 52 గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించాను. నియోజక వర్గంలోని మిగిలిన గ్రామాలను కవర్ చేసేందుకు కొత్త వ్యూహంతో ముందుకు రావాలని ఆలోచిస్తున్నాను. సుదూర ప్రాంతాల్లో పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం.
న్యూస్‌మీటర్ : మీరు కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారా?
గీత: వైఎస్ జగన్, కేంద్ర ప్రభుత్వం అండతో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం గత ఐదేళ్లలో నిస్సందేహంగా అభివృద్ధి చెందింది. రెండు మూడు నియోజకవర్గాల్లో వేలాది మందికి ఉపాధి కల్పించే అనేక పరిశ్రమలకు ఆవిర్భవించాయి. గతంలో ఈఎస్‌ఐ ద్వారా అందించే ఆసుపత్రి సేవలను వినియోగించుకునేందుకు రాజమండ్రి వెళ్లేవారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 100 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రిని తీసుకురావడం ఎంపీగా నేను సాధించిన ఘనమైన విజయం. విద్య, ఆరోగ్య రంగాన్ని పునరుద్ధరించడమే నా ప్రాధాన్యత. రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ యూనిట్, క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి, సౌకర్యాలను అందించడానికి CSR చొరవగా రూ. 30 కోట్లను అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కాకినాడలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నవరం ఆలయ గర్భగుడి అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.25 కోట్లతో పాటు కేంద్రీయ విద్యాలయానికి రూ.50 కోట్లతో శాశ్వత భవనం మంజూరైంది.
న్యూస్‌మీటర్ : పిఠాపురం అభివృద్ధికి మీ అజెండా ఏమిటి?
గీత : నియోజకవర్గంలో ఉన్న అనేక దేవాలయాలతో పిఠాపురం సంవత్సరాలుగా గొప్ప చరిత్ర, సంస్కృతితో ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే ప్రతిపాదన ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక విద్యాసంస్థలు ఉండగా.. కేంద్రం, రాష్ట్రం నుంచి ఆమోదం పొందిన తర్వాత మరికొన్ని విద్యాసంస్థలు రానున్నాయి.
ఉప్పాడ వద్ద సముద్ర కోత ఒక ముఖ్యమైన సమస్య, ఇది నియోజకవర్గాన్ని కూడా పీడిస్తోంది; ప్రధానమంత్రి కార్యాలయానికి ఇప్పటికే ఈ సమస్యపై అవగాహన కల్పించాం. ప్రధాని కార్యాలయం ఈ సమస్యను పర్యవేక్షిస్తోంది. నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన.. వరిసాగుపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టాం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మరికొన్ని కార్యక్రమాలతో ముందుకువస్తాం.
పిఠాపురం సమీపంలోని 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెజ్‌లో ప్రధాన కార్పొరేషన్‌లు తమ సౌకర్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఏలూరు అప్‌స్ట్రీమ్‌ను ఆధునికీకరించడం వంటి నీటిపారుదల ప్రాజెక్టులను పునరుజ్జీవింపజేయడం రైతులకు చాలా ముఖ్యమైనది. నియోజకవర్గంలోని వ్యవసాయ ప్రాంతాలను కాపాడేందుకు కాలువలను క్రమబద్ధీకరించి, ఎగువ నుంచి వచ్చే అదనపు నీటిని నేరుగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన ప్రాంతంలో పిఠాపురం కూడా ఉంది.