ఫ్రీగా సినిమా చూపిస్తామన్నారుగా.. బ్లాక్‌లో టికెట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు

Perni Nani About Bheemla Nayak Movie. నీతులు చెప్పే ఓ హీరో పనికిమాలిన పనులు చేస్తున్నాడని ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని

By Medi Samrat  Published on  25 Feb 2022 5:06 PM IST
ఫ్రీగా సినిమా చూపిస్తామన్నారుగా.. బ్లాక్‌లో టికెట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు

నీతులు చెప్పే ఓ హీరో పనికిమాలిన పనులు చేస్తున్నాడని ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని.. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా..? బ్లాక్ టికెట్ వ్యవస్థను నిర్మూలించడం తప్పా..? అని ప్ర‌శ్నించారు. ఓ సినిమా కోసం తండ్రీ కొడుకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని.. సినిమాను కూడా చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమ‌ర్శించారు. సినిమాను ప్రభుత్వం తొక్కడమేంటో అర్థం కావడం లేదని.. ప్రభుత్వ చట్టాలు వాటికి వర్తించవా..? అని సందేహం వ్య‌క్తం చేశారు.

జీవో 37 ప్రకారం సినిమా టికెట్ ఛార్జీలు ఉండాలని చెప్పామ‌ని.. హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ జీవోలను పట్టించుకోరా..? అని ప్ర‌శ్నించారు. సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారుగా.. ఫ్రీగా చూపించుకునేవారికి బ్లాక్‌ మార్కెట్లో ఎందుకు టికెట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీలు సినిమా బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. పవన్ సినిమా చూడాలంటూ లోకేష్ ట్వీట్ చేశాడు. టీడీపీ జెండా మోసిన జూ.ఎన్టీఆర్‌ను ఏనాడైనా పట్టించుకున్నారా..? అని ప్ర‌శ్నించారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మడం తప్పని చెప్పాల్సిన మీడియా.. రాజ్యాంగ హక్కుగా చిత్రికరిస్తున్నాయని.. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు.. లేకపోతే లేదని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.


Next Story