24న పవన్ ‘వారాహి’ కి పూజలు
Pawan Kalyan’s ‘Varahi’ Vahana Pooja’ scheduled for 24 Jan. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ని సిద్ధం చేశారు.
By Medi Samrat Published on 16 Jan 2023 8:38 PM ISTజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ని సిద్ధం చేశారు. ఇప్పటికే తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తైన ఈ వాహనానికి త్వరలో పూజలు చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. కొండగట్టులో ఆయన వారాహికి పూజ చేయించబోతున్నారు. ఈ నెల 24న పవన్ కొండగట్టు వెళ్తారు. అక్కడ పూజ పూర్తైన తర్వాత సమీపంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పవన్ దర్శించుకోనున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత తెలంగాణలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చిస్తారు. అదే రోజున ‘అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శనం)’ ప్రారంభించాలని కూడా పవన్ నిర్ణయించారు. ముందుగా ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం క్రమంగా మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ దర్శించుకుంటారు. గతంలో 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురైనప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత భద్రతతో వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం. వాహనం ప్రారంభం సందర్భంగా వాహనం రంగుపై అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాహనం రంగు ఆలివ్ గ్రీన్‌ను ఆర్మీ మినహా మరే ప్రైవేట్ వాహనం ఉపయోగించరాదని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోటారు వాహన చట్టం ప్రకారం, ఆర్మీ తప్ప మరెవ్వరూ ఆలివ్ గ్రీన్ ఉపయోగించకూడదు. వారాహి వర్ణం ఆలివ్ గ్రీన్ కాదని తెలంగాణ రవాణా శాఖ వివరించింది. TS13 EX 8384 అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు.
వారాహి వాహనం ప్రత్యేకతలు:
· వారాహికి ప్రత్యేక లైటింగ్.. అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
· వాహనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత భద్రతా చర్యలతో రూపొందించబడింది.
· గతంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనలో లైట్లు ఆఫ్ చేయడం వంటి చర్యలను గమనించి, వాహనంలో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
· వారాహిలో అన్ని వైపులా CCTV కెమెరాలు ఉన్నాయి, అవి మీటింగ్ షెడ్యూల్ చేయబడిన స్థలంలో రికార్డింగ్ చేస్తాయి
· ఆధునిక సౌండ్ సిస్టమ్ వేలాది మంది పవన్ కళ్యాణ్ ప్రసంగాలను స్పష్టంగా వినడానికి సహాయపడుతుంది.