అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ ఇప్పుడు వైరల్.. ఎందుకంటే?
ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By Medi Samrat Published on 5 Sept 2023 7:20 PM ISTఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మన దేశం G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి ఈ నెల 9న విందును ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంది. ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని అని ముద్రించి ఉండటంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతూ ఉంది. జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ మన దేశం పేరు ‘భారత్’ అని ముద్రించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భారత్ పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ దేశం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. ఆ ప్రసంగంలో ఇండియా అంటే బ్రిటిష్ వారు పెట్టిన పేరు, భారత్ అనేది మన స్వంత పేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియో బ్యాక్ గ్రౌండ్ చూస్తే చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించినదని అంటున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమా స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడికి సంబంధించినది. ఆ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇండియా అనే పదం వెనుక ఉన్న బ్రిటీషర్స్ ఉద్దేశ్యం గురించి వివరించారు. అలాగే భారత స్వాతంత్ర్య సమరయోధులను, గొప్పతనాన్ని తన ప్రసంగంలో వివరించారు.