జనంలోకి జనసేనాని..!
జనవరి నెలాఖరు నుంచి జనంలోకి వెళ్లాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని
By Medi Samrat Published on 21 Jan 2024 9:20 PM ISTజనవరి నెలాఖరు నుంచి జనంలోకి వెళ్లాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన జోనల్ కమిటీలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. రోజుకు మూడు సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. పవన్ పర్యటనల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా ఉంటాయని నాదెండ్ల పేర్కొన్నారు.
దాదాపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా బహిరంగ సభలు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని 5 జోన్ లు విభజించి, బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు.. బాధితులతో పవన్ కల్యాణ్ మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జోనల్ కమిటీ సభ్యులదేనని నాదెండ్ల స్పష్టం చేశారు.