జనసేనాని పవన్ కల్యాణ్ రేపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామానికి వెళుతున్నారు. పవన్ కల్యాణ్ ఈ రాత్రికి మంగళగిరి చేరుకుని రేపు ఉదయం ఇప్పటం గ్రామ ప్రజలను కలుస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూలుస్తున్నారని జనసేన ఆరోపణ చేస్తోంది.
ఈ ఘటనలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమకు ఓటు వేయని వారిని శత్రువుల్లా చూస్తున్నారని, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఈ ఉదయం నుంచి జరుగుతున్న అరాచకమే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. అమరావతిలోనే జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవాలని తాము భావించామని, స్థలం కోసం అన్వేషిస్తుండగా, సభకు స్థలం దొరకకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అయినప్పటికీ ఇప్పటం గ్రామస్తులు ధైర్యంగా ముందుకువచ్చి తమకు స్థలం ఇచ్చారని వివరించారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉండగా, దాన్ని 120 అడుగుల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ ఉదయం నుంచి జేసీబీల సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని తెలిపారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన జనసైనికులు, వీరమహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జనసేనాని ఆరోపించారు.