భీమవరంలో వారాహి విజయ భేరీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని అన్నారు. జూలియా రాబర్ట్స్ లాంటి క్రిస్టియానిటీలో పుట్టిన వ్యక్తి హిందూ మతంలోకి మారినప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. తిరుపతి, తిరుమలలో అన్యమత ప్రచారం సరికాదన్నారు. మసీదు, చర్చికెళ్లి హిందూ ధర్మాన్ని ప్రభోదించకూడదని.. అలాగే హిందూ దేవాలయాలకు వెళ్లి అన్య మతాలను ప్రచారం చేయకూడదన్నారు. తాను చెప్పింది తప్పయితే తనను ఉరి తీయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలా మాట్లాడితే కొంత మంది ఓట్లు పడవనే భయం తనకు లేదని.. ఏది సరైందనుకుంటే అదే మాట్లాడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
వైఎస్ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని, పథకాల పేరుతో ప్రజను మభ్యపెడుతున్నాడన్నారు పవన్ కళ్యాణ్. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఆర్థికంగా కుంగుబాటుకు గురవ్వకుండా ఆదుకుంటామని పవన్ భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కోసమే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వలసలు, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ఎన్డీఏ లక్ష్యం.. ప్రజల బంగారు భవిష్యత్తు కోసం మేం నిలబడ్డామని అన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు.