వారితో పెను ముప్పు పొంచి ఉంది : పవన్ కళ్యాణ్
రోహింగ్యాల అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
By Medi Samrat
రోహింగ్యాల అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కొందరు ప్రభుత్వ యంత్రాంగంలోని వ్యక్తుల సహకారంతోనే రోహింగ్యాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, వారికి సులభంగా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు కూడా అందుతున్నాయని తెలిపారు. 2017-18 సంవత్సరాల మధ్యకాలంలో, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు బంగారం పని నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వలస వచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. మయన్మార్‌కు చెందిన ఈ రోహింగ్యాల వలసల వల్ల స్థానిక యువత తీవ్రంగా నష్టపోతోందని, వారికి దక్కాల్సిన ఉద్యోగావకాశాలు చేజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహకరిస్తున్న యంత్రాంగంపై కఠిన నిఘా ఉంచాలని, అంతర్గత భద్రత విషయంలో మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదులకు సున్నితమైన లక్ష్యంగా మారాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, పరిపాలన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తాను లేఖ రాసినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గారిని లేఖ ద్వారా కోరానన్నారు. ముఖ్యంగా వలస వచ్చే వారి విషయంలో సరైన నిఘా ఉంచడం ద్వారా సంభవించబోయే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. తీర ప్రాంతంలో కూడా నిరంతర పర్యవేక్షణ, నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలిసిందని, ఈ పరిణామాల దృష్ట్యా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .