జనసేనలో చేరికలు.. వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా
Pawan Kalyan Fire On YSRCP Govt. జనసేనాని పవన్ కల్యాణ్ నేడు సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు.
By Medi Samrat
జనసేనాని పవన్ కల్యాణ్ నేడు సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు, విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ చైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పవన్ కల్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సర్కారుకు సలహాదారుగానూ వ్యవహరించారు. రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరారు.
సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చిపోరాడుతున్నానన్నారు. ఎవరికో కొమ్ముకాస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని.. బీజీపీ, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదని, పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమీషన్లు కొట్టేసే రకం కాదన్నారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాఠీ దెబ్బలు తినేందుకైనా.. జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు వస్తాయని.. అధికారం పోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ దాడులు చేసే అవకాశాలుంటాయన్నారు.