ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలిపి వాకౌట్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారన్నారు. ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఇక అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు.