'కలలో కూడా ఊహించలేదు.. అంతా ఆ భగవంతుడి సంకల్పం'

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి.. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో.. అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

By -  Medi Samrat
Published on : 9 Jan 2026 9:15 PM IST

కలలో కూడా ఊహించలేదు.. అంతా ఆ భగవంతుడి సంకల్పం

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి.. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో.. అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. అప్యాయత, అనురాగాలకు నిలువటద్దాలు. వాటి మూలలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు. మన మూలలను మనం మరిచిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి నుంచి.. కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవన సౌందర్యానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పిఠాపురం చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ భగవంతుడి సంకల్పం అని పేర్కొన్నారు.

Next Story