ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటారని, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని, భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే ఒక టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు.