ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టిన పవన్ కల్యాణ్
Pawan Kalyan Comments On AP Govt Decision. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవుల తర్వాత స్కూళ్లు మళ్లీ మొదలయ్యాయి.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవుల తర్వాత స్కూళ్లు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. ఏపీలో రాత్రివేళ కర్ఫ్యూ, ఇతరత్రా ఆంక్షలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు కరెక్ట్ కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొవిడ్ తీవ్రత తగ్గేంత వరకు తరగతులను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత కష్ట సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే డాక్టర్లు, వైద్య సహాయక సిబ్బంది, మెడికోలు, పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నట్టు వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలు కూడా కరోనా బారినపడుతుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని వివరించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, ఆయన త్వరగా కోలుకుని ఎప్పట్లాగే ప్రజల కోసం పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.