హైకోర్టు నుంచి తప్పించుకోడానికి హడావుడి నిర్ణయం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan Comments On AP Capital. మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డిఏ ర‌ద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన

By Medi Samrat  Published on  22 Nov 2021 2:38 PM GMT
హైకోర్టు నుంచి తప్పించుకోడానికి హడావుడి నిర్ణయం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డిఏ ర‌ద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులలో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటమి తప్పదని భావించిన జగన్ రెడ్డి ప్రభుత్వం తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లుల‌ రద్దుకు ఉపక్రమించిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావిస్తున్నారని ఆయ‌న అన్నారు.

కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో జగన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా.. రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చిలకపలుకు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారని విమ‌ర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వైసిపి పెద్దలు మునిగి తేలుతున్నారని ప‌వ‌న్ అన్నారు.

రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో నాటి ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన జగన్ రెడ్డి.. తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని ప‌వ‌న్ ఆరోపించారు. 33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ లక్ష కోట్లు అవసరమవుతాయని, అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఇంత విస్తీర్ణంలో లేదని ఇప్పుడు చెబుతున్న జగన్ రెడ్డి.. కనీసం 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మరచిపోయారని అన్నారు.

రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారని ఆరోపించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులుపెట్టారని.. మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆరోపించారు. ఉద్యమంలో ఉన్న ఎస్సీలపై ఎస్సీలతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా.. ఒక్క వైసిపి మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని విమ‌ర్శించారు.

రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోందని ప‌వ‌న్ త‌మ పార్టీ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు జ‌న‌సేనాని.


Next Story