సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం అక్రమ తరలింపునకు సంబంధించిన సమాచారాన్ని అంకబాబు తమ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు పవన్. అసలు అంకబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనే లేదని కూడా పవన్ ఆరోపించారు. సింగిల్ పోస్టును షేర్ చేస్తేనే అంకబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. నేతలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన కామెంట్లు పోస్ట్ చేస్తున్న వైసీపీ శ్రేణులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
ఈ ఘటనలపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారన్నారు లోకేశ్. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారని.. అంతటితో ఆగని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వాట్సాప్ లో వార్త పోస్ట్ చేశారని అంకబాబును అరెస్ట్ చేయడమే అన్యాయం అనుకుంటే.. ఆయనకు మద్దతుగా గళం విప్పిన సాటి జర్నలిస్టులను వేధించడం ఇంకా దారుణమని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకబాబు అరెస్ట్ ని, పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహా టీవీ ఎండి వంశీ తో పాటు పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.