ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Pawan Kalyan About Nandamuri Taraka Ramarao. దివంగత నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో
By Medi Samrat Published on 28 May 2022 11:00 AM GMTదివంగత నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు, తెలుగు దేశం పార్టీకి చెందిన వారు ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఉన్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి ఘటిస్తూ ఉన్నారు. ఆ లిస్టులో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్టీఆర్ కూడా ఒకరని పవన్ కళ్యాణ్ అన్నారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా ఆయనకు నమస్కారాలని తెలిపారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేదని.. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎన్టీఆర్ ను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్మరించుకున్నారు. వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయసీమను అవిఘ్నంగా ఏలిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగువారిగా మనందరి అదృష్టమని.. కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన వికసిత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.