గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి 1న సీఎం చేతులమీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేస్తాం

తణుకు నియోజకవర్గంలోని తేతలిలో ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే కార్యక్రమం లాంచనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి తెలిపారు.

By Medi Samrat  Published on  25 Jan 2025 8:44 PM IST
గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరి 1న సీఎం చేతులమీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేస్తాం

తణుకు నియోజకవర్గంలోని తేతలిలో ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే కార్యక్రమం లాంచనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 1.14 లక్షల ఇళ్ల ను ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల లబ్ధిదారులకు తాళాలు అందచేస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశమందిరంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు కలిగి ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. గత ప్రభుత్వం తీరుతో పేదలకు ఇళ్లు అందించే పథకం కుంటుపడిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్లీ గాడిలో పెట్టి అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ. 4,500 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థతి నేపథ్యంలో సైతం పేదలకు ఇళ్లు అందించాలన్న ఏకైక లక్ష్యంతో రూ. 502 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 2024 డిసెంబర్ తో నే పీఎంఏవై 1.0 గడవు ముగిసినప్పటికీ సీఎం చంద్రబాబు కృషితో 2025 డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం సమయం పెంచడం జరిగిందన్నారు. దీంతో హౌసింగ్ అధికారులకు, సిబ్బందికి పేదల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

రాష్ట్రంలో అక్కడక్కడా ఇసుక కొరత సమస్య ఉందని గుర్తించి ప్రభుత్వం రూ. 5.19 కోట్లు తక్షణం కేటాయించి ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దీంతో పేదల ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి కనిపించిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కేవలం సంక్షేమం మాత్రమే కాదని రాష్ట్ర పురోగతికి కారణంగా పేర్కొన్నారు. పీఎంఏవై పథకం లో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ కు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటికి ఉపాధి పథకంలో భాగంగా 90 నుంచి 100 రోజులు పనిదినాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 7 కోట్ల పనిదినాలు వస్తాయి. దీంతో రూ. 2100 కోట్లు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఆదాయం చేకూరుతుందన్నారు. ఆ మొత్తం 40 శాతం మెటిరీయల్ కాంపౌండ్ కింద వాడుకున్నట్లయితే మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండ జీఎస్టీ రూపంలో కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలకు అందించడానికి ఇప్పటికే క్యాబినేట్ లో కూడా ఆమోదించడం జరిగిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడానికి విధి విధానాలు రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో రెవిన్యూశాఖామాత్యులు ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. 2014-19 సమయంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష్యతో బిల్లులు ఎగ్గొట్టిందన్నారు. వారికి న్యాయం చేయడానికి సుమారు రూ. 900 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఒక నెలలోపే రూ. 40 కోట్లు కేటాయించాలన్న దృక్పదంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూనిట్ కాస్ట్ ను కూడా పెంచాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారన్నారు. గత టీడీపీ పాలనలో మాదిరిగానే ఇళ్లు నిర్మించుకునే ఎస్సీలకు రూ. 50వేలు, ఎస్టీలకు రూ. 75వేలు అదనంగా ఇచ్చారో అదేమాదిరిగా ఇప్పుడు కూడా ఇవ్వాలన్న ఆదేశాలు త్వరలోనే ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 2014-19 మధ్యలో ఒక యూనిట్ కాస్ట్ రూ. 2.50 లక్షలు నిర్ణయించి వారికి చేయుతనివ్వగా గత ప్రభుత్వం కేవలం రూ. 30వేలు మాత్రమే ఇచ్చి పేదల ఇళ్ల పథకంకు తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story