మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్‌లో నూతన రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
2024 బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక చర్యలను ప్రకటించారు.
‘ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్ లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగర అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
సీతారామన్ రాష్ట్రంలో మహిళల ప్రత్యేక పథకాల కోసం రూ.3 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆమె రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వెనుకబడిన ప్రాంత గ్రాంటును ప్రకటించారు.