'భోజనంలో విషం' ఆరోపణలపై స్పందించిన నారా లోకేష్
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబుకు పంపించే ఆహారంలో
By Medi Samrat
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబుకు పంపించే ఆహారంలో వారి కుటుంబ సభ్యులే ఏదైనా కలపొచ్చంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. భోజనంలో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ కుటుంబ డీఎన్ఏలోనే లేవని చెప్పారు. విషం కలపడం, బాబాయ్ ని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలో ఉన్నాయని విమర్శించారు. మీ కుటుంబంలోని విషయాలను బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దని, రాజకీయపరంగానే పోరాడాలని తమ అధినేత చంద్రబాబు చెప్పారని... అందుకే తాము సంయమనం పాటిస్తున్నామన్నారు లోకేష్. ప్రజల కోసం తాము పోరాడుతున్నామని, ఏ తప్పు చేయనప్పుడు తాము ఎవరికీ భయపడబోమని అన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యమని చెప్పారు. 2019కి ముందు తనపై కేసులు లేవని... ఇప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేయబోతోందని లోకేశ్ తెలిపారు. జనసేన శ్రేణులతో కలిసి టీడీపీ శ్రేణులు పోరాడాలని సూచించారు. జనసేనాని పవన్ కల్యాణ్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జగన్ అంటున్నాడని, భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదని లోకేశ్ చెప్పారు. ఇందిరాగాంధీకే భయపడలేదని చెప్పుయికొచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.