నాగబాబు హై ఓల్టేజ్ విమర్శలు
Nagababu Fire On AP Govt. భీమ్లానాయక్’ సినిమా టికెట్ల వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 27 Feb 2022 6:11 AM GMT'భీమ్లానాయక్' సినిమా టికెట్ల వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం పగ పట్టిందని మండిపడ్డారు. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలపాలని ప్రశ్నించారు. పవన్‌పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని, ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు పవన్‌కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదని ప్రశ్నించారు. ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి సమస్య వస్తే మేం ముందుటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోనే ఉండేది ఐదేళ్లేనని వైఎస్సార్‌సీపీ గుర్తించాలన్నారు.
పవన్ సినీ ఇండస్ట్రీ తరఫున మాట్లాడాడని, తన కోసం పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దన్నారని రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుర్తు చేశారు. అవసరమైతే తన సినిమాలు ఆపుకోవాలని పవన్ చెప్పాడన్నారు. ఇదంతా సినిమా ఇండస్ట్రీ కోసం చేశారని.. ఇప్పుడు, భీమ్లానాయక్‌కు వ్యతిరేకంగా ఇంత చేస్తున్నా పవన్ కల్యాణ్ కి అనుకూలంగా ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా మాట్లాడలేదని తెలిపారు. ఓ హీరో సినిమాని కావాలని అన్యాయంగా తొక్కేస్తోంటే, ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలూ ఉన్నా ఒక్కరూ స్పందించకపోవడం దారుణమని నాగబాబు అన్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు నాశనం అయిపోయేవారని నాగబాబు అన్నారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని నాగబాబు అన్నారు. ఉత్తర కొరియా, చైనా, రష్యాల్లో మాదిరిగా మన దేశంలో నియంతలా పాలించే అవకాశం లేదని.. ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.