ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే వాటికి ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ జరపాలన్ని అన్ని జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశించారు.
నవంబర్ 1వ తేదీన ఈ ఎన్నికలకు షెడ్యూల్ సహా నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, కర్నూలు జిల్లాలలో బేతంచర్ల, అనంతపురం జిల్లాలో పెనుకొండ, పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, చిత్తూరు జిల్లాలో కుప్పం, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం, ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక అవసరమైన చోట మంగళవారం నాడు రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నవంబర్ 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.