బినామీ ఉద్యమానికి చంద్ర‌బాబు దళిత రంగు వేస్తున్నారు : ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh Fires On Chandrababu. అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దళితుల రంగు వేయాలని

By Medi Samrat  Published on  9 Aug 2021 12:31 PM GMT
బినామీ ఉద్యమానికి చంద్ర‌బాబు దళిత రంగు వేస్తున్నారు : ఎంపీ నందిగం సురేష్

అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దళితుల రంగు వేయాలని ప్రయత్నిస్తున్నాడని బాపట్ల లోక్‌స‌భ‌ సభ్యుడు నందిగం సురేష్ ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం అంటూ వచ్చిన పసుపు మహిళల సామాజికవర్గం ఏమిటో అందరికీ తెలుసునని.. పట్టుమని పది మంది కూడా లేని ఆ గ్రూపులో ప్రతి ఒక్కరు మిలియనీర్లు లేదంటే బాబు బినామీలు లేదంటే బాబు ఆత్మ బంధువులే అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మామూలు రోజుల్లో అమరావతి దీక్షల్లో ఒక్కరూ కనిపించరని, ధర్నాలు, 600వ రోజుల పండుగలకు మాత్రం జనాలు పోగవుతారని, ఇదంతా లేని ఉద్యమానికి హైప్‌ క్రియేట్‌ చేయడం కోసమేనని నందిగం సురేష్ అన్నారు.

రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదని, ఇక్కడేదో జరిగిపోతుందనే కాన్సెప్ట్‌తో చంద్రబాబు నాయుడు ఇటువంటి ఉద్యమాలు సృష్టిస్తున్నాడని అన్నారు. ఇందులో భాగంగానే దళితుల పేరు జపిస్తున్నాడని, ఈ రాష్ట్రంలోని దళితుల ప్రయోజనాన్ని అణగదొక్కిన వారే రోడ్లెక్కి మాట్లాడుతుంటే దళిత సమాజం నవ్వుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో దళితులను అణగదొక్కడంలో చంద్రబాబుది ప్రత్యక్ష పాత్ర అయితే, పరోక్ష పాత్ర ఈనాడు, ఏబీఎన్, టీవీ5లది అన్నారు. టీడీపీ అండ్ కో.. కు కావాల్సింది స్టేట్‌ కాదు రియల్‌ ఎస్టేట్‌ మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు ఇక్కడ ఉండటం లేదుకానీ, ఆయన మనసంతా అమరావతి భూముల మీదేనని, వాటి మీద తాను లాక్కోవాలని పెట్టుకున్న వేల కోట్ల సంపద మీదేనని నందిగం సురేష్ దుయ్యబట్టారు.


Next Story