70 ఏళ్ళలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు

MLC C Ramachandraiah Fires On BJP. దేశంలో బీజేపీ అంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరోకటి లేదని వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య

By Medi Samrat  Published on  9 Nov 2021 2:28 PM IST
70 ఏళ్ళలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు

దేశంలో బీజేపీ అంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరోకటి లేదని వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య విమ‌ర్శించారు. ఆర్దిక రంగాన్ని కుదేలు చేసిన బీజేపీ.. దేశంలోని నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారని.. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేశారానని నిలదీశారు. లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే ఎల్ఐసీ సంస్థను ప్రైవేట్ పరం చేస్తానని చెప్పడం సిగ్గు చేటని మండిప‌డ్డారు.

కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలను నియత్రించగలిగారా.. అని ప్ర‌శ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని కావని.. వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని నిల‌దీశారు. పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పి ఆ హామీని తలపైన పెట్టేశారని విమ‌ర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. 157 మెడికల్ కళాశాల మంజూరు చేస్తే ఎపీకి ఓక్క కళాశాల కేటాయించక పోవడం సిగ్గు చేటు అని మండిప‌డ్డారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలకు రైళ్లు కూడా వేయలేదని.. 70 ఏళ్ళలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు. నూతన చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్విర్యం చేశారని.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయని కారణంగా స్టీల్ కోరత ఏర్ప‌డింద‌ని.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఉక్కు కర్మాగారాలను ప్రైవేట్ పరం చేసి నిర్వర్యం చేశారని అన్నారు. ఎల్ఐసీ ఇచ్చిన సోమ్ముతో సంస్థలు ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం ఏమిటని ప్ర‌శ్నించారు.

బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక రంగం కుదేలయ్యింద‌ని.. కరోనా నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి లో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచింద‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉనికి లేకుండా చేస్తోంద‌ని.. డీజిల్ ధరలను పెంచిందెంత.. తగ్గించిందెంత అని ప్ర‌శ్నించారు. ధరలను, సెస్ పెంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలపడుతుందని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ఇక్కడి నేతలు కేంద్రంలోని పెద్దలను ప్రశ్నించారా అని ఫైర్ అయ్యారు.


Next Story