ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సీఐఐ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ముందుంటామన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) పై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి పాలసీని తయారుచేస్తామని మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సీఐఐ సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.