పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై ఉన్న శ్రద్ద వైద్య కళాశాలలపై ఎందుకు లేదు.?
వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై పెట్టిన శ్రద్దను.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలపై పెట్టలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
By - Medi Samrat |
వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై పెట్టిన శ్రద్దను.. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలపై పెట్టలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. రూ.451 కోట్ల భారీ వ్యయంతో ప్యాలెస్ ను నిర్మించిన జగన్ పేద వైద్య విద్యార్థుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయాలన్న చిత్త శుద్దిలేని వైకాపా నేతలు పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలల నిర్వహణపై అవగాహన రాహిత్యంతో, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీపీ విధానం దేశవ్యాప్తంగా అమల్లో ఉందన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం రూ.8 లక్షల 44వేల కోట్ల విలువైన పనులు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద పీపీపీ విధానంలో పనులు జరుగుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు అద్భుతంగా నడుస్తున్నాయని తెలిపారు. శాసనమండలిలో బుధవారం వైద్య కళాశాలలు-పీపీపీ విధానం' అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. "పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్, ప్రైవేటీకరణ మధ్య ఉన్న తేడా తెలియని వారు సీఎంగా ఐదేళ్లపాటు పనిచేయడం మన దౌర్భాగ్యం. దురదృష్టకరం. పలు రాష్ట్రాల్లో డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. పీపీపీ విధానాన్ని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, చెన్నై ఐఐటీ వంటి ఉన్నత విద్య సంస్థల్లోనూ అనుసరిస్తున్నారు. 33 ఏళ్ల తరువాత ఆ వైద్య కళాశాలలన్నీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయి. కళాశాలల నిర్వహణ కోసం టెండరు ద్వారా ఎంపిక చేసిన సంస్థలు పెట్టుబడి పెడతాయి. కళాశాలలు నడుపుతాయి. ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రస్తావనే ఇక్కడ ఉత్పన్నం కాదు' అని మంత్రి సత్యకుమార్ వివరించారు.
ప్రతి కళాశాలలో 150 చొప్పున సీట్లు
" ప్రభుత్వం వద్దనే యాజమాన్య హక్కులు ఉంటాయి. కళాశాలలపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. పీపీపీ విధానంలో నడిచే కళాశాలల్లో జాతీయ స్థాయి కోటా కింద సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉండదు. కన్వీనర్ కోటాలోని 50% సీట్లు ఉచితంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. పీపీపీ విధానంలో నడవబోయే కళాశాలల్లో 150 చొప్పున సీట్లుంటాయి. పీపీపీ విధానంలో ప్రారంభించే వైద్య కళాశాలల్లో 625 పడకలుంటాయి. వీటిల్లో ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. ఇన్‌పేషంట్ల కోసం కేటాయించిన పడకల్లో70% ఉచితంగా పేదలకు కేటాయించాలి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా కింద సేవలు ఉచితంగా పీపీపీ విధానంలో నడిచే కళాశాలల్లోనూ కొనసాగుతాయి. గత వైకాపా పాలనలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్లు ఆమోదిత వ్యయం కాగా...రూ.1,550 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. కేంద్రం, నాబార్డు నుంచి వచ్చిన నిధులను మాత్రమే ఇందుకు వినియోగించింది. వైద్య కళాశాలల నిర్మాణాల పునరుద్ధరణకు రూ.786.82 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చుపెట్టింది. పార్వతీపురంలో కళాశాల ఏర్పాటుకు గత వైకాపా ప్రభుత్వం భూమిని కూడా సేకరించలేదు. భూమి లేకుండా నిర్మాణాలు జరపగలరా? ఇదసలు సాధ్యమవుతుందా? బెంగుళూరులో భూమిని కొనుగోలుచేయకుండానే.. భవనాలు నిర్మించారా? ప్యాలెస్ నిర్మాణం చేశారా? పులివెందుల కళాశాలలో నిర్మాణాలైతే జరిపారు. కానీ అధ్యాపకులను నియమించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎన్ఎంసీ 47.5% బోధకుల కొరత ఉందని తనిఖీల ద్వారా గుర్తించింది. ఇప్పటికే ప్రారంభమైన రాజమహేంద్రవరం వైద్య కళాశాలకు రూ.475 కోట్లు ఆమోదిత వ్యయం కాగా.. గత వైకాపా ప్రభుత్వంలో... కేవలం రూ.81.74 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టారు. కూటమి ప్రభుత్వం రూ.53.73 కోట్లు ఖర్చుపెట్టింది. మచిలీపట్నం కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద రూ.195 కోట్లు గ్రాంటు వచ్చింది. దీనివల్ల ఈ కళాశాలకు రూ.550 కోట్ల ఆమోదిత వ్యయానికిగాను రూ.206 కోట్లు గత ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ కళాశాల బిల్లుల చెల్లింపుల కోసం కూటమి ప్రభుత్వం రూ.86.32 లక్షలను కూటమి ప్రభుత్వం చెల్లించింది ...అని మంత్రి వివరించారు.
చంద్రబాబు హయాంలో 17 కళాశాలల రాక
"చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 17 వైద్య కళాశాలలొచ్చాయి. 2000 - 2004, 2004-19, 2024-25లో ఈ కళా శాలలొచ్చాయి. ఈ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 22,500 మంది విద్యార్థులు ఉచితంగా ఎంబీబీఎస్
చదివారు. వాస్తవాలు వక్రీకరిస్తూ చంద్రబాబు హయాంలో ఒక కళాశాల కూడా రాలేదని వైకాపా నేతలు అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు' అని సత్యకుమార్ వివరించారు.
చర్చ నుంచి పారిపోతున్నారంటూ మంత్రి ఎద్దేవా
మంత్రి సత్యకుమార్ పీపీపీ విధానం అమలుపై కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్ణయాన్ని తీసుకుంది? ఉపయోగాలేమిటి? ఇతర వివరాలు చెబుతుండగా వైకాపా ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నంచేశారు. వైసిపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేయడంతో చర్చ నుంచి పారిపోతున్నారంటూ మంత్రి ఎద్దేవాచేశారు.